మ‌ల్టీస్టార‌ర్ హీరో మ‌న న‌ట‌శేఖ‌రుడు

By KTV Telugu On 17 November, 2022
image

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆయ‌నదే రికార్డు

మీ హీరో గొప్ప‌నా..మా హీరో గొప్ప‌నా… ఫ్యాన్స్ మ‌ధ్య ఈ సంవాదం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉండేదే. అలాంటి ప‌రిస్థితుల్లో కూడా వెండితెర‌పై కొత్త ఒర‌వ‌డి సృష్టించిన ఘ‌న‌త కృష్ణ‌ది. ఎప్పుడ‌న్నా ఓ మ‌ల్టీస్టార‌ర్ సిన్మా వ‌స్తే ఆ హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అలాంటిది దాదాపు 80 మల్టీస్టారర్ సిన్మాల‌తో సూప‌ర్‌స్టార్ కృష్ణ చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ చెర‌గ‌ని రికార్డు సృష్టించారు. కృష్ణ మరో హీరోతో కలిసి తొలిసారి ఇద్దరు మొనగాళ్లు చిత్రంలో న‌టించారు. అందులో ఆయ‌న స‌హ క‌థానాయ‌కుడు కాంతారావు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో తర్వాత మరో రెండు సిన్మాలు వ‌చ్చాయి. పాతాళభైరవి సినిమాలో ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయిన కృష్ణ న‌ట‌ర‌త్న‌తోనే కలిసి నటించే అవకాశం రావడం గురించి గొప్ప‌గా చెప్పుకునేవారు. ఎన్టీఆర్‌తో కలిసి కృష్ణ నటించిన తొలి సినిమా స్త్రీ జన్మ. తర్వాత న‌ట‌ర‌త్న‌ న‌ట‌శేఖ‌ర‌ కాంబినేషన్‌లో నిలువు దోపిడీ, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు-వగలమారి భర్తలు సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. ఈ ఐదు సిన్మాల్లో కృష్ణ‌-ఎన్టీఆర్ సోదరులుగా నటించడం విశేషం.

కృష్ణ సిన్మాల్లోకి రావ‌డానికి ప్ర‌ధాన స్ఫూర్తి న‌ట‌సామ్రాట్‌. అక్కినేనిని చూసే తానెప్ప‌టిక‌యినా హీరోని కావాల‌ని ప‌ట్టుద‌ల పెంచుకున్నారు కృష్ణ‌. ఏఎన్నార్ స్ఫూర్తితోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో కలిసి మంచి కుటుంబం, అక్కాచెల్లెలు, హేమాహేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం సినిమాల్లో నటించారు. ఈమ‌ధ్యే క‌న్నుమూసిన కృష్ణంరాజుతో కూడా కృష్ణకు వెండితెర అనుబంధం ఎక్కువే. కృష్ణ‌తో కలిసి అంద‌రికంటే ఎక్కువ సిన్మాలు చేశారు రెబ‌ల్‌స్టార్‌. కృష్ణ‌-కృష్ణంరాజు కలిసి ఏకంగా 19 చిత్రాల్లో న‌టించారు. ఇక శోభన్‌బాబుతో 13, మోహన్‌బాబుతో 4, కాంతారావుతో 3, శివాజీ గణేశన్‌తో 3, రజనీకాంత్‌తో 3, సుమన్‌తో 3, నాగార్జునతో 2, చిరంజీవి, బాలకృష్ణ, రాజశేఖర్‌, హరికృష్ణ, రవితేజలతో ఒక్కో సినిమా చేశారు న‌ట‌శేఖ‌రుడు. తన కొడుకులు రమేశ్‌బాబుతో 5, మహేశ్‌బాబుతో 7 చిత్రాల్లో కనిపించారు. అందుకే ఆయ‌న లేర‌నే నిజాన్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.