టీడీపీలో వాళ్లేందుకు టెన్షన్ పడుతున్నారు..

By KTV Telugu On 30 May, 2022
image

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలు జరుపుకుంటున్న వేళ ఒంగోలులో నిర్వహించిన టీడీపీ మహానాడు సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రకాశం జనసంద్రం కావడం, ఎన్టీయార్ చెప్పినట్లుగా నేల ఈని… జనం పుట్టలు పుట్టలుగా బయట పడటం జరిగిపోయింది. మహానాడు ముగిసిన తర్వాత కూడా ఇంకా జనం వస్తూనే ఉన్నారంటే.. పార్టీ పట్ల వారిలో విశ్వాసం పెరుగుతోందన్న అభిప్రాయమూ కలుగుతోంది. కార్యకర్తల్లో ఒక సారిగా కనిపించిన ఉత్సాహం చూసి.. నేతలు ఉబ్బితబ్బిబయ్యాయి. జయం మనదేరా… 2024లో మనమేరా అన్న డైలాగులు మిన్నంటాయి. జగన్ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని బయట పడేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీల జడివాడ కురిపించారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సాధ్యమని  చెప్పేశారు. ఇదంతా బాగానే ఉన్నా మహానాడుతో మరో కోణం ఆవిష్కృతమైంది. పార్టీ ప్రక్షాళనపై అగ్రనేతలు మహానాడుకు ముందు, మహానాడులోనూ వదిలిన కొన్ని డైలాగులు ఇప్పుడు కొందరు నేతల్లో భయాన్ని రేకెత్తించాయి. రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలను కలిగిస్తున్నాయి….

టీడీపీలో యూత్ సెంటిమెంట్

40 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో యువతకు సరైన ప్రాధాన్యం దక్కలేదని అధిష్టానం లేటెస్టుగా గుర్తించింది. దానితో ఇప్పుడు 40కి 40 అన్నట్లగా యువతకు పదవుల్లోనూ, టికెట్లలోనూ 40 శాతం అవకాశాలుంటాయని చంద్రబాబు ప్రకటించారు. మూడు సార్లు ఓడిపోయిన వారికి మరో ఛాన్స్ ఉండదని, ఎక్కువ కాలం పదవులను అంటిపెట్టుకుని ఉన్న వాళ్లు కొంత కాలం పదవులకు విశ్రాంతినిచ్చి పార్టీ కోసం పనిచేయాలని లోకేష్ సూచించారు. పార్టీని సమర్థించే కొందరు మేధావి వర్గం మరికొంత దూరం వెళ్లింది. ఈ సారి 60 శాతం స్థానాలు ఇవ్వాలని సలహా పడేసింది. సలహాదారుల మాట తూచ తప్పకుండా పాటించే చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ దిశగా కొందరు నేతలను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది….

అచ్చెన్న, సోమిరెడ్డి, చింతమనేని

పార్టీ భవిష్యత్తు, ఎన్నికల్లో టికెట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ రెండు విధాలుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. లోకేష్ చెప్పినట్లుగా మూడు సార్లు  ఓడిపోయిన వారిని పక్కన పెట్టడం మొదటిదైతే… ఎవరి వల్లనైనా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నాయో…వారిని కొంతకాలం లైమ్ లైట్లో లేకుండా చేయడం రెండోది. రెండో కోణంలో చూస్తే కనీసం ముగ్గురు నలుగురు కీలక నేతలను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దూకుడుతో పాటు ఆయన తీరుపై అధిష్టానం కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ముందు వెనకా చూసుకోకుండా ఆయన ఏదిబడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు కొంతమేర అసహనంగా ఉన్నారట.. పార్టీనా బోక్కా.. అని అచ్చెన్న కామెంట్ చేస్తున్న వీడియో వైరల్ కావడం, అందులో లోకేష్ పట్ల కూడా ఆయన వ్యతిరేకతా భావాన్ని కనబరచడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ వీడియోను బాగా వైరల్ చేసిన వైసీపీ.. తెలుగుదేశం పార్టీని ఒక ఆట ఆడుకుంది. పైగా ఉత్తరాంధ్రలో అచ్చెన్న స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయట.

మరో పక్క మూడు సార్లు ఒడిపోయిన వారిలో సోమిరెడ్డి ముఖ్యులు. ఆయన మాటల మరాఠీ మాత్రమేనని, సొంత సీటు కూడా గెలుచుకోలేడని జోకులు పేలుతున్నాయి. గెలవలేకపోయినా గ్రూపులు కడుతున్నారని ఆరోపణలు వచ్చాయి పైగా మంత్రి అంబటి రాంబాబు.. నెల్లూరు వడివేలు అని.. తమిళ కమేడియన్ తో పోల్చింది కూడా సోమిరెడ్డినేనని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరో పక్క చింతమనేని ప్రభాకర్ పట్ల కూడా అధిష్టానం అసంతృప్తిగా ఉంది. తన రౌడీయిజం, తొందరపాటు చర్యలతో పార్టీని దెబ్బతీశారని ఆగ్రహం చెందుతోంది. ఓడిపోయిన తర్వాత కూడా చింతమనేని తీరు మారలేదని, నిత్యం ఏదోక వివాదంలో చిక్కుకుంటున్నారని సీరియస్ గా ఉంది. దానితో అలాంటి వారిని చూసీచూడనట్లుగా అనే కంటే.. చూడనట్లుగా వదిలేస్తేనే బెటరని భావిస్తోంది.  ఏదేమైనా ప్రతీ జిల్లాలో ఇద్దరు ముగ్గురు సీనియర్లకు ఈ సారి ఎమ్మెల్యే టికెట్లు దక్కవని పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి..