రేవంత్ కబ్జాలో కాంగ్రెస్ ! సీనియర్లకు దారేది ?

By KTV Telugu On 22 June, 2022
image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా జెండా పాతేస్తున్నారు. సీనియర్లను ప్లాన్డ్‌గా పక్కన పెట్టేసి తన వర్గం అనుకున్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. కొత్తగా ఇతర పార్టీల నుంచి తీసుకొస్తున్నారు. పార్టీని వీడిన వారందరినీ మళ్లీ తీసుకొస్తున్నారు. నిజానికి వీరంతా సీనియర్ నేతలతో గొడవల కారణంగా టీఆర్ఎస్ నుంచి ఆఫర్ రావడం వల్ల వెళ్లిపోయారు. ఇప్పుడు సీనియర్ నేతలను పక్కన పెట్టేశామని మనదే రాజ్యం అని చెప్పి రేవంత్ మళ్లీ పార్టీలోకి తీసుకు వస్తున్నారు.  దీంతో వారంతా రేవంత్ విధేయులుగా మళ్లీ పార్టీ గుమ్మం ఎక్కుతున్నారు. పార్టీలో చేరికలంటే ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అందుకే రేవంత్‌ను ఎవరూతప్పు పట్టలేకపోతున్నారు.

రేవంత్ రెడ్డి లేని సమయంలో సీనియర్లంతా చింతన్ శిబిరం నిర్వహించారు. అందులో  అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఉండి, పదవులు అనుభవించి, ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలో చేరిన వాళ్లను తిరిగి తీసుకోవద్దని తీర్మానం చేశారు. కానీ రేవంత్ రెడ్డి చింతన్​శిబిర్ తీర్మానాలతో సంబంధం లేదన్నట్టుగానే పార్టీని వీడిన నేతలను తిరిగి తీసుకువచ్చే పనిలో పడ్డారు . డీఎస్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్‌గా లేడని ఆయన కుమార్తెకు కాంగ్రెస్ కండువా కప్పుతున్నారు.  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేవంత్ ను చూసి పార్టీలో చేరేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు. మహబూబ్​నగర్​నుంచి ఎర్ర శేఖర్​పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు.  ఎర్ర శేఖర్‌కు రేవంత్​రెడ్డి అండగా ఉంటున్నారు. కానీ అక్కడ సీనియర్ నేతలు మాత్రం తమ పరిస్థితేమిటని మథనపడుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో  పూర్తిగా సీనియర్లను పక్కన పెట్టే ఎత్తుగడతో కొత్త వారిని రేవంత్​రెడ్డి తెరపైకి తీసుకువస్తున్నారు. దీంతో సీనియర్లు కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. జనగామలో మాజీ మంత్రి పొన్నాల, సత్తుపల్లిలో సంభాని చంద్రశేఖర్, నిజామాబాద్‌లో మధుయాష్కీ, కామారెడ్డిలో షబ్బీర్ అలీ, ఖైరతాబాద్‌లో దాసోజు శ్రవణ్​ వంటి నేతలకు రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారు.  కాంగ్రెస్​ పార్టీలో పాత వాళ్లకే టికెట్​ఇస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిరగాలని ఏఐసీసీ నుంచి మొదలుకుని టీపీసీసీ వరకు పాత నేతలకు సంకేతాలిచ్చింది. ఇదే అంశాన్ని కీలకంగా తీసుకుని చింతన్​ శిబిర్‌లో కూడా చేర్చారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ఇవ్వరాదని, పార్టీని వీడిన వారిని కూడా ఇలాంటి సమయంలో పార్టీకిలో తీసుకోరాదని తీర్మానించారు.

అయితే పార్టీ బలోపేతం పేరుతో ప్రస్తుతం గతంలో పార్టీని వీడిన వారితో రాయబేరాలు సాగుతున్నాయి.  ఇటీవల కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల లిస్ట్ అంటూ ఓ జాబితా ప్రచారంలోకి వచ్చింది.  తెలంగాణ పీసీసీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించిందని   పార్టీ హైకమాండ్ కు అభ్యర్థుల జాబితా పంపిందనే ప్రచారం సాగుతోంది. తాజాగా పీసీసీ పంపిన జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ బయటికి వచ్చింది. గాంధీభవన్ నుంచి ఈ జాబితా లీకైందని అంటున్నారు. పీసీసీ నుంచి ఏఐసీసీకి వెళ్లినట్లుగా చెబుతున్న ఈ జాబితా ఇప్పుడు కాంగ్రెస్ లో సెగలు రేపుతోంది. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వారి పేర్లు ఎక్కువగా ఉండటంతో సినియర్లు భగ్గుమంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని కబ్జా చేసే కుట్రని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు మొదటి నుంచి అంతే ఉంటాయి. ఇతర పార్టీలపై గెలుపు కోసం ప్రయత్నం చేయడం కన్నా.. ముందు తమలో తాము ఒకరిపై ఒకరు గెలవాలని ప్రయత్నిస్తూంటారు. ఆ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓడిపోతూనే వస్తోంది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సీనియర్లను నిర్వీర్యం చేస్తున్నారు. పూర్తిగా పార్టీ తన అధీనంలో ఉండేలా చూసుకుంటున్నారు.  రేవంత్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే రేవంత్ అన్నట్లుగా మార్చేందుకు రెడీ అయ్యారు. ఈ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ సీనియర్లు తంటాలు పడుతున్నారు. రేపు ఏదైనా తేడా జరిగితే.. ఏపీ సీం జగన్‌లా పార్టీ క్యాడర్ మొత్తాన్ని రేవంత్ తన వైపు తిప్పుకుని పార్టీ పెట్టుకుటంారని.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండదని కొంతమంది సీనియర్లు హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు