రాజకీయాల్లో వ్యక్తిగత గెలుపులు ఎప్పుడూ ఉండవు. గెలిపించినా.. ఓడించినా ప్రజలే. అయితే ఆ ప్రజాభిమానాన్ని పొందడం కూడా వ్యక్తిగతంగా సాధ్యం కాదు. మన కోసం ఎంత మంది ఉంటారన్నదానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. వైసీపీ గెలుపు కోసం గత ఎన్నికల్లో ఎంతో మంది పోరాడారు. తల్లి , చెల్లి ప్రచారం చేశారు. మేధావులు.. అదే పనిగా తిరిగారు. పార్టీతో సంబంధం లేని వారు కూడా సహకరించారు. కానీ ఇప్పుడు వారంతా జగన్ వెంటే ఉన్నారా..?
సగం కుటుంబాన్ని దూరం చేసుకున్న జగన్ !
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తే బయటకు రాలేదు . ఉన్నా ఆయన సర్దుబాటుచేసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏకతాటిపైన ఉంచడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎంత విఫలం అయ్యారంటే.. చివరికి కన్న తల్లితో కూడా మాటల్లేని పరిస్థితి వచ్చింది. ఇక చెల్లితో వివాదాల గురించి చెప్పాల్సిన పని లేదు. వైఎస్ కుటుంబంలో భార్య తరపు బంధువులు తప్ప.. ఇతరులతో సన్నిహిత సంబంధాలు పూర్తిగా కొరవడ్డాయి. కుటుంబ ఏకతాటిపై ఉంటేనే రాజకీయంగా కూడా బలంగా ఉంటారు. కానీ కుటుంబాన్నే జగన్ ఏకతాటిపైకి ఉంచలేకపోయారు.
ఆత్మీయులు కూడా దూరమే !
ఎన్నికలకు ముందు అధికారంతో సంబంధం లేకుండా ఎంతో మంది ఆత్మీయులు జగన్ చుట్టూ ఉండేవారు. ఆయనను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా పని చేసేవారు. కానీ మాకు కనీసం అపాయింట్ మెంట్ కూడా లేదు.. మా బాధలు వినేవారు లేరనే అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది. చివరికి చర్చిల్లో ఆయన కోసం ప్రార్థనలు చేసిన వాళ్లు కూడా… బ్రదర్ అనిల్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే మాజీ ఐఏఎస్ లు.. పలువురు మేధావులు కూడా ఇప్పుడు జగన్ వెంట లేరు. కొంత మంది సలహాదారుల పదవులు తీసుకుని సైలెంట్ అయిపోయారు. వారు ఠంచన్‌గా జీతాలు తీసుకుంటున్నారు కానీ.. జగన్‌కు న్యాయం చేయలేకపోతున్నారు. ఎందుకైనా మంచిదని వారు దూరం పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు .
టీఆర్ఎస్ , బీజేపీ మనస్ఫూర్తిగానే సహకరిస్తున్నాయా ?
అధికారంలోకి రాక ముందు టీఆర్ఎస్ గొప్ప దోస్తీ ఉన్న పార్టీ. గెలవగానే.. ముందుగా కేసీఆర్ దగ్గరకు వెళ్లారు బీజేపీ కూడా అంతే. కానీ ఇప్పుడు ఈ రెండు పార్టీలు అంత ఆత్మీయంగా ఉన్నాయా..? అంటే చెప్పడం కష్టం. టీఆర్ఎస్ .. ఏపీ పాలనను అవహేళన చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడాన్ని తప్పు పడుతోంది. ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. బీజేపీ .. పైకి సహకరిస్తున్నట్లుగా ఉంది కానీ.. పలు కేసుల్లో నిండా ముంచుతోందని.. తమపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి తన వంతు కృషి చేస్తోందని.. కాస్త రాజకీయంగా ఆలోచించినా అర్థమైపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో అవసరం తీరిపోయిన తర్వాత బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో చెప్పలేని పరిస్థితి.
జగన్‌కు ఇంత కాలం పిల్లర్లుగా ఉన్న వాళ్లెవరూ లేరు. కుటుంబం.. పార్టీ .. ఆత్మీయులు.. కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. కానీ సజ్జల మాత్రమే దగ్గరవుతున్నారు. జగన్ అంటే ఇప్పుడు సజ్జల మాత్రమే కనిపిస్తున్నారు. అది కుటుంబ విషయాలైనా.. పాలనా విషయాలైనా.. మరొకటైనా. ఇది జగన్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదమని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.