బాబోయ్ పులి.. జాగ్రత్త సుమీ

By KTV Telugu On 17 November, 2022
image

జనానికి పులుల భయం ఎందుకు పెరుగుతోంది ? అడవికి రాజు అక్కడ ఉండకుండా ఊళ్ల మీదకు ఎందుకు పడుతోంది ? దీనిపై అధికారులు ఇస్తున్న వివరణ ఏమిటి ? ఓసారి చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పులుల సంచారం
2020 తర్వాత ఎక్కడ చూసినా పులులే
తాజాగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రైతును చంపిన పులి

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పులుల సంచారం బాగా పెరిగింది. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులులు క్రమంగా జనారణ్యాల్లోకి కూడా వస్తున్నాయి. 2020 నుంచి ఏపీ, తెలంగాణలో జనానికి పులులు కనిపించడం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా కుమ్రం భీం ఆసిఫా బాద్‌ జిల్లా వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన ఆదివాసీ రైతు సిడాం భీము పులిదాడిలో మృతి చెందాడు. పొలంలో పత్తి ఏరుకుంటున్న సిడాం భీముపై పులి దాడి చేసి లాక్కెళ్లింది. పక్క పొలంలో ఉన్న రైతులు కేకలు వేయడంతో భీమును వదిలేసి వెళ్లింది. అప్పటికే ఆయన మృతిచెందాడు.

రోజు ఏదోక ప్రాంతంలో పులి సంచారం
పులుల బారిన పడుతున్న మూగజీవాలు
రెండేళ్ల క్రితం దహేగాం మండలంలో పులి దాడి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరిగింది. ప్రతీ రోజు ఏదోక ప్రదేశంలో మూగజీవాలు పులుల దెబ్బకు విగతజీవులవుతున్నాయి. పులులు అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో తిరుగుతూ జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రెండేళ్ల క్రితం దహెగాం మండలం దిగడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌, పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లికి చెందిన నిర్మలను పులులు పొట్టనబెట్టుకున్నాయి. గతేడాది దాదాపు 120 పశువులపై దాడులు చేశాయి. ఈ ఘటనల్లో సుమారు 70 పశువులు ప్రాణాలు కోల్పోయాయి. వారం క్రితం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం గూడ గ్రామ శివారులో పెన్‌గంగ కాలువలో రెండు పులులు కనిపించగా, రెండు రోజుల క్రితం పిప్పల్‌కోటీ ప్రాంతంలో నాలుగు పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. గతేడాది ఎక్కువగా ఆసిఫాబాద్‌ జిల్లాలోని బెజ్జూర్‌, పెంచికల్‌పేట్‌, దహెగాం మండలాల్లోని ప్రాణహిత అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం ఉండగా, ఈ ఏడాది వాంకిడి, ఆదిలాబాద్‌ సరిహద్దులోని పెన్‌గంగ సరిహద్దుల్లో పులుల అలజడి ఎక్కువగా ఉంటోంది.

రెండు రాష్ట్రాల్లో కలిపి 70కి పైగా పులులు
కాకినాడ జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్
మూడొంతుల పులులు నల్లమలలోనే…
పులల సంరక్షణ కోసం అధికారుల చర్య

ఏపీలో కూడా పులుల సంచారం ఎక్కువైంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది రాయల్ బెంగాల్ టైగర్ కనిపించింది. అది పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఏరియాలో పులుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం వెళ్లి వచ్చే ప్రయాణికులకు ఎక్కువగా పులులు తారసపడుతున్నట్లు సమాచారం. ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం, నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ల పరిధిలో ఉన్న నల్లమలలో అత్యధికంగా పులుల జాడ కనిపిస్తోంది. నాలుగేళ్లలో రెండు రాష్ట్రాల్లో పులుల సంఖ్య 45 నుంచి 70 దాటిందని అంచనా వేస్తున్నారు. అందులో ఏపీలోనే 50 వరకు ఉండొచ్చు. పులుల సంరక్షణ, వాటికి ఆహారం సమకూర్చడంలో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పులులు సంచరించే ప్రదేశాలకు వెళ్తున్న జనం
అమ్రాబాద్ ప్రాంతంలో చేవల వేట
పోడు వ్యవసాయంతోనూ ఇబ్బందులు
కొత్త ప్రాంతాలకు తరలి వస్తున్న పులులు
కాలి ముద్రలు చూసి జాగ్రత్త పడాలంటున్న అధికారులు

పులుల బారిన పడటమంటే అది జనం చేస్తున్న తప్పేనని అటవీ అధికారులు అంటున్నారు. ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో కృష్ణా నది ఉంటే అక్కడ చేపల వేటకు వెళ్లే జాలర్లపై పులులు దాడి చేసే ప్రమాదం ఏర్పడినప్పుడు తాము స్వయంగా వారితో ఆ పని మాన్పించామని అధికారులు చెబుతున్నారు. పోడు వ్యవసాయంతో జనం పులుల సంచరించే ప్రాంతాలకు దగ్గరవుతున్నారు. పైగా పులుల సంఖ్య పెరగడం కూడా జనం ఇబ్బందులకు ఒక కారణం కావచ్చు. ప్రతీ పులి తనకోసం కొంత టెరీటరీని ఎంచుకుంటుంది. అలా చేస్తున్నప్పుడు కొత్త ప్రాంతాలకు వచ్చి జనం మీద అవి దాడులు చేస్తున్నాయి. అందుకే జనమే జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. పులి కాలి ముద్రలు కనిపించిన చోట సంచరించకుండా వెళ్లిపోతే ప్రాణాలు దక్కుతాయి. పులి బతుకు పులిది. జనం భయం జనానిది కదా.